యాక్షన్ కింగ్ అర్జున్ 'సింహద మారి సైన్య' (1981) అనే కన్నడ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ బళ్లారిలో జరుగుతుండగా, ఆయన పుట్టినరోజు వచ్చింది. యూనిట్ మెంబర్స్ సెట్స్‌పై ఆయన బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. అది తెలిసిన ప్రొడ్యూసర్ ఇద్దరు కొడుకులు ఆయనకు పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో వాళ్లు ఏం చేశారంటే ఓ కూల్‌డ్రింక్‌ను అర్జున్‌కు ఆఫర్ చేశారు. ఆయన తాగారు. ఆ డ్రింక్ చాలా రుచిగా అనిపించింది. అదివరకు ఎన్నో కూల్‌డ్రింకులు తాగినా, అందులో ఉన్న 'టేస్ట్' ఇదివరకు కనిపించలేదు. ఇదేదో చాలా బాగుందే అని వరసగా పది డ్రింకులు తాగేశారు.
ఆ తర్వాత తను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఏదో తెలియని మైకం.. ఆనందం.. చాలా తమాషాగా ఉంది. అలాంటి స్థితిలో కారు ఎక్కబోయి కిందపడ్డారు. ఆ సినిమాలో నటించిన మిత్రులు ఆయనకు సాయంపట్టి కారులో కూర్చోబెట్టారు. వారు బస చేసిన హోటల్ రూమ్‌కు చేరుకున్నారు. ఆ రోజు రాత్రంతా "నువ్వు పామువి" అంటే "నువ్వు జింకవి" అని, "నువ్వు ఏనుగువి" అంటే "నువ్వు కోతివి" అనీ.. ఇలా ఏకపాత్రాభినయాలు చెయ్యడంతో సరిపోయింది. తెల్లారి తెలివి వచ్చేసరికి బెడ్ కింద ఉన్నారు అర్జున్. ముందురోజు రాత్రి జరిగిన ఘటన లీలగా గుర్తకువచ్చి ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత అర్జున్ మెల్లిగా ఆరా తీస్తే తెలిసిందేమంటే.. కూల్‌డ్రింక్‌లో విస్కీ కలిపి తనచేత తాగించారని. అంతవరకూ మత్తు పానీయాలంటే ఎరగని ఆయన వాటిని రుచి చూసింది అప్పుడే. ఆ ఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ తనలో తనే నవ్వుకుంటూ ఉంటారు అర్జున్.